Fertility : సంతానం కోసం ప్లాన్‌ చేస్తున్నారా..? ఈ తప్పులు చేయకండి..!

Fertility : పెళ్లైన తర్వాత.. చాలామంది జంటలు.. మొదట్లో ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు ముందు కెరీర్‌లో సెటిల్‌ అవ్వాలి, లైఫ్‌ను కొన్నిరోజులు ఎంజాయ్‌ చేయాలి అనుకుంటారు.. కానీ ఇంకొంతమంది పిల్లలు కావాలి అని కోరుకుంటారు.



Child's future : పెళ్లైన తర్వాత.. చాలామంది జంటలు.. మొదట్లో ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు ముందు కెరీర్‌లో సెటిల్‌ అవ్వాలి, లైఫ్‌ను కొన్నిరోజులు ఎంజాయ్‌ చేయాలి అనుకుంటారు.. కానీ ఇంకొంతమంది పిల్లలు కావాలి అని కోరుకుంటారు. పిల్లలు కావాలి అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల నేడు ఎంతోమంది సంతానలేమితో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో మందులను వాడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ప్రెగ్నెన్సీ కోసం వాడే ట్యాబ్లెట్స్‌ వల్ల జుట్టు రాలడం, ముఖంపై మొటిమలు, దుద్దర్లు చిన్నవయసులోనే పెద్దవాళ్లలా కనిపించడం జరుగుతుందట. ఇక మగవారిని అయితే మానసికంగా దెబ్బతీస్తుంది.  

సాధారణంగా మహిళల్లో వంధ్యత్వానికి అండోత్సర్గము, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) , లూపస్, గర్భాశయ అసాధారణతలు కారణంగా ఉంటాయి.. పురుషుల విషయంలో తక్కువ స్థాయి టెస్టోస్టెరాన్, తక్కువ స్పెర్మ్ కౌంట్ అలాగే సల్ఫసాలజైన్ వంటి కొన్ని ఓవర్-ది-కౌంటర్ మందులు వంధ్యత్వానికి దారితీయవచ్చు. శరీరంలో తలెత్తే దీర్ఘకాలిక మంట, వాపులు కూడా వంధ్యత్వానికి సంబంధించిన సంకేతాలుగా ఉంటున్నాయని పరిశోధకులు అంటున్నారు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం వలన గర్భధారణ రేటు మెరుగుపడుతుంది, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) వంటి చికిత్సలలో కూడా సానుకూల ఫలితాలు వస్తున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వారు పేర్కొన్నారు.

సంతాన సామర్థ్యాన్ని పెంచే చిట్కాలు

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వలన వంధ్యత్వాన్ని నియంత్రించవచ్చు. గర్భం కోరుకునే జంటలకు మీ సంతానోత్పత్తి స్థాయిలను పెంచడానికి, మీరు అనుసరించాల్సిన కొన్ని ఆరోగ్య సూత్రాలు ఇవే..

చురుకైన జీవనశైలి..

చురుకైన జీవనశైలిని అవలంబించడం వలన సంతానోత్పత్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. మీ శరీరాన్ని అర్థం చేసుకొని, మీ సామర్థ్యానికి తగినట్లుగా వ్యాయామాలు చేయండి, యోగాసనాలు సాధన చేయండి. బరువుగా ఉంటే.. ముందు ఆ బరువును తగ్గించే పని మొదలుపెట్టండి.. మితిమీరిన వ్యాయామం కూడా మంచిది కాదు. అధిక తీవ్రతతో కూడిన వ్యాయామం చేయడం వలన కొంతమంది స్త్రీలలో సంతానోత్పత్తి స్థాయిలలో తగ్గుదలకు దారితీస్తుంది. కాబట్టి రోజుకు ఒక అరగంట పాటు వ్యాయామం చేయండి చాలు.

పొగ త్రాగటం మానేయండి..

ఇప్పటివరకూ తాగారు ఓకే.. ఇకనైనా మానేయండి.. పురుషుల్లో పొగతాగడం వల్ల..స్పెర్మ్‌ కౌంట్‌ దెబ్బతింటుంది. స్త్రీలలో అయితే చస్ట్‌ షేప్‌ అవుతుంది..
ధూమపానం శ్వాసకోశ రుగ్మతలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులనే కాకుండా, ఇది పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి స్థాయిలను కూడా తగ్గిస్తుంది. మీరు సంతానం కోసం ప్లాన్ చేస్తుంటే, ధూమపానం పూర్తిగా మానేయండి.

మద్యపానం తగ్గించండి..

అధిక మద్యపానం అండోత్సర్గము రుగ్మతలు, శరీరంలో వాపులు, బలహీనమైన పేగు, కాలేయ పనితీరు మందగించడం వంటి అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మద్యపానానికి కొన్నిరోజులు దూరంగా ఉండండి..

ఒత్తిడిని తగ్గించండి.

ఒత్తిడి, ఆందోళనలు వ్యక్తుల సంతానోత్పత్తి స్థాయిలపై ప్రభావం చూపుతాయి. మీ చేతుల్లో లేనిదాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించకండి.. జరిగేది జరుగుతుంది.. ఎందుకు అంత ఆగం అవడం.. వీలైనంత వరకూ ఉన్నదాంతో సంతృప్తిపడటం, సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోండి.. మీ కంటే దయనీయమైన స్థితీలో చాలామంది ఉంటారు. హ్యాపీగా ఉండండి..మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఒత్తిడిని నియంత్రించుకోండి. అనవసరపు ఆందోళనలకు దూరంగా ఉండండి. ప్రశాంతమైన జీవనం గడపండి. ధ్యానం ఆచరించడం వలన ఒత్తిడి తగ్గుతుంది.

తగినంత నిద్ర..

ఇది చాలా ముఖ్యం.. మీరు తీసుకునే విశ్రాంతి మీ శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది, మిమ్మల్ని రిఫ్రెష్‌గా, చురుకుగా ఉంచుతుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. మీరు తగినంత నిద్ర పోవడం వలన మీ సంతానోత్పత్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. వీటితో పాటు ఆహారంలో విషయంలో కూడా శ్రద్ధ తీసుకోండి. విటమిన్స్‌, మినరల్స్, పోషకాలు ఉండే ఆహారాలు తినండి.. బయట బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు మానేయండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.