మధ్య వయసు దాటిన తరువాత స్త్రీలలో రుతుచక్రం ఆగిపోవటం సహజం. ఏళ్ల తరబడి క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఇలా ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటాము. మెనోపాజ్ సగటు వయసు 51 సంవత్సరాలు. అయితే మెనోపాజ్‌కి 5 నుంచి 7 సంవత్సరాలకు ముందు నుంచే మహిళల శరీరంలో కొన్ని మార్పుల వస్తూ ఉంటాయి. అండాశయాల నుంచి హార్మోన్ల విడుదల ఆగిపోవడం, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం జరుగుతుంది. దీని వల్ల కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఎముక లోపల క్యాల్షియం, విటమిన్ డి తగ్గి అవి బలహీనంగా మారతాయి. మరి మెనోపాజ్ సమయంలో ఎముకలను ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం...
కాల్షియం ఎక్కువగా ఉండాల్సిందే..
మెనోపాజ్ సమయంలో ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి.. కాల్షియం చాలా అవసరం. ఈ సమయంలో మహిళలకు ఈ కాల్షియం ఎక్కువ అవసరం. అందుకే మహిళలు ప్రతిరోజూ కాల్షియం తీసుకోవాలి.
విటమిన్ డి..
కాగా శరీరం కాల్షియంను గ్రహించుకోవడానికి.. తగినంత విటమిన్ డి చాలా అవసరం. అందుకే మహిళలు ప్రతిరోజూ కనీసం కొంతైనా విటమిన్ అందేలా చూసుకోవాలి.. ఉదయం, సాయంత్రం పూట కొంత సమయంలో ఎండలో ఉంటే మంచిది. అలాగే విటమిన్ డి పుష్కలంగా ఉండే గుడ్లు, ఫ్యాటీ ఫిష్, పట్టగొడుగులు, ఓట్స్ తింటే మంచిది.
పోషకాహారం..
పోషకాలు పుష్కలంగా ఉండే.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మెనోపాజ్ సమయంలో ఎముక సాంద్రత కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
తగినంత నిద్ర ఉండాల్సిందే..
ఆరోగ్యంగా ఉండాలంటే.. తగినంత నిద్ర చాలా అవసరం. ప్రశాంతమైన నిద్ర .. ఎముక సాంద్రత కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
వ్యాయామం అవసరం...
ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి వ్యాయామం అవసరం. నడక, జాగింగ్, డ్యాన్స్, బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయండి.
మద్యం.. స్మోకింగ్ మానేయాలి...
ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగినా.. ఎముకల సాంద్రత తగ్గుతుంది. పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆల్కాహాల్‌కు కూడా దూరంగా ఉండాలి. స్మోకింగ్ వల్ల ఎముక సాంద్రత తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతుంది. మహిళలు ధూమపానానికి దూరంగా ఉండాలి.