Fiber : శరీర ఆరోగ్యానికి పీచు కావాల్సిందే.. ఈ ఆహరం తింటే లోపల ఇంత పని జరుగుతుందా..!

Fiber ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తింటే చాలా లాభాలు, మన శరీరానికి ఫైబర్ అనేది 40గ్రాములు కావాలి. నోటి దగ్గర నుంచి మలం ద్వారాం వరకూ 7మీటర్లు పొడవుగా ఉంటాయి ప్రేగులు. అసలు పీచు పదార్థాలు ఉండే ఆహారాలు

Fiber : శరీర  ఆరోగ్యానికి పీచు కావాల్సిందే..  ఈ ఆహరం తింటే లోపల ఇంత పని జరుగుతుందా..!
High Fiber Foods


ఫైబర్ ( Fiber ) ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తింటే చాలా లాభాలు ఉంటాయని వైద్యులు ఎప్పుడు చెప్తుంటారు. కానీ మనం మాత్రం ఆ పదార్థాలే తక్కువగా తింటాం. అ‌వి ఈజీగా అరుగుతాయి.. హాయిగా ఉంటాయి అయినా కూడా మనకు అ‌వి నచ్చవు. మన శరీరానికి ఫైబర్ అనేది 40గ్రాములు కావాలి. నోటి దగ్గర నుంచి మలం ద్వారాం వరకూ 7మీటర్లు పొడవుగా ఉంటాయి ప్రేగులు.  21 అడుగులు ప్రేగులు అన్నింటిని క్లీన్ చేయడానికి ఫైబర్ కావాలి.

సింపుల్ గా చెప్పాలంటే..ఇంటికి చీపురు ఎలాగో ఒంటికి ఫైబర్ అలా అన్నట్లు. చీపురు లేని ఇళ్లు ఎంత డర్టీగా ఉంటుందో..ఫైబర్ లేని ఒళ్లు కూడా అంతే డర్టీగా ఉంటుంది. మారుతున్న టెక్నాలజీతో మనం అప్ డేట్ అయ్యాం..ప్రతిపదార్ధాల్లో.. పండించటం మొదలు.. అమ్మేవరకూ రసాయనాల సమ్మేళనం ఎక్కువైంది. జనరల్ గా ఏ పదార్ధానికైనా..పై పొరల్లో పీచులు ఉంటాయి. కానీ మనం పాలిష్ చేయటం వల్ల అది కాస్తా వేస్టేజ్ రూపంలో వెళ్లిపోతుంది. బియ్యం పాలిష్ చేసినప్పుడు వచ్చే తౌడులో ఎన్నో పోషకవిలువలు ఉంటాయి. అది గేదలకు వేసి..కేవలం తెల్లగా ఉన్న బియ్యాన్ని మనం తింటాం. పీచుపదార్ధాలు బాగా ఉన్న ఆహారాలు అన్నీ.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో దోహదపడాతాయి.  

అసలు పీచు పదార్థాలు ఉండే ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం

ప్రకృతి ప్రసాదించిన శాఖాహారాలు అన్నింటిలోనూ పీచు ఉంటుంది. మాంసాహారాలు అన్నింటిలోనూ పీచులు ఉండవు. నాచురల్ గా తీసుకుంటేనే అన్నీ అందుతాయి. జామకాయలో 7-8 గ్రాములు పీచులు ఉంటాయి. సపోటా 9 గ్రాములు ఉంటాయి. ఇలానే పప్పాయి, కమలాలు కూడా. దానిమ్మ గింజలు కూడా పూర్తిగా నమిలితినాలి.

కూరగాయలు లేతగా ఉన్నప్పుడు తొక్కలతో పాటు వండుకుంటే శరీరానికి పుష్కలంగా పీచు అందుతుంది. అరిటికాయ, బీరకాయ, సోరకాయ, క్యారెట్ ఇలాంటివి అన్నీ లేతగా ఉన్నప్పుడు తొక్కలను తీయొద్దు. ఒకవేళ ముదురుగా ఉంటే..తోలు తీయొచ్చు. 

అన్నింటి కంటే..ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్నాయి చిరుధాన్యాలు, విత్తనాలు. ముఖ్యంగా గోదుమలు, రాగులు, జొన్నలు, కొర్రలు వీట్నింటిలో 11 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బార్లీ 15 గ్రాములు, ఓట్స్ 14-15 గ్రాములు పీచుపదార్థాలు ఉంటాయి. పాలిష్ పట్టిన బియ్యంకానీ, పాలిష్ పట్టిన గోధుమరవ్వ కానీ ఇలాంటివి తింటే..అందులో పీచుపదార్థాలు ఉండవు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ముడిబియ్యం తినాలని చెప్తారు. ఒకప్పుడు మన పూర్వీకులు ఇలాంటి బియ్యమే తిని..వృధ్యాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండేవాళ్లు. ఇప్పుడు మనకు చిన్నచిన్నవాటికే..ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం..మనం తినే ఆహారమే. 

ఇక విత్తనాల విషయానికి వస్తే.. రాజ్మా గింజల్లో 17 గ్రాములు పీచుపదార్థాలు..పెసల్లో కూడా అంతే. మినుములు తీసుకుంటే 20 గ్రాములు సుమారుగా ఉంటాయి. సోయాబిన్స్, మాములు చిక్కుడు గింజల్లో అయితే 23 గ్రాములు పీచుపదార్థాలు ఉన్నాయి. శనగల్లో 25 గ్రాములు ఫైబర్ ఉంటుంది.  

types of fiber foods | Soluble and insoluble fiber

పీచుపదార్థాలు రెండు రకాలు ఉన్నాయి

1. కరగని పీచుపదార్థాలు 

కరగని ఆహార పీచుపదార్థాలు (డైటరీ ఫైబర్), పేరుకు తగ్గట్టుగా..ఇవి నీటిలో కరగవు. ఈ ఆహారపీచుపదార్థాలు మన ప్రేగులలోని నీటితో పాటు కలిసిపోయి అక్కడి ఆహారానికి గాత్రాన్ని (బల్క్) చేకూరుస్తాయి. కరగని పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు రవాణా సమయాన్ని పెంచుతాయి. అంటే. ఆహారం పేగులో ఉండే సమయం. కడుపు నిండిన అనుభూతిని ఈ పీచుపదార్థాలు కలిగిస్తాయి. కరగని పీచుపదార్థాల వల్ల ప్రేగు కదలికను నియంత్రిస్తుంది. మలబద్దకాన్ని తగ్గించడం, బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. పండ్ల తొక్కలు, గోధుమ ఊక, తృణధాన్యాలు మొదలైన వాటిలో కరగని పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

2. కరిగే పీచుపదార్థాలు    

కరిగే పీచుపదార్థాలు నీటిలో కరిగి పేగులలో బంక లాగా లేదా ‘జెల్’ లాంటి పదార్థంగా మారతాయి. వీటిని ప్రధానంగా పండ్ల గుజ్జు, బార్లీ, విత్తనాలు, ఎండుగింజలలో గుర్తించవచ్చు మన ఆహారంలో అధిక భాగం వాస్తవానికి పేగులోని సూక్ష్మజీవులచే జీర్ణమవుతుంది కాబట్టి, ఒక నిర్దిష్ట రకం పీచుపదార్థాలు తినడం మన పేగు యొక్క ఆరోగ్యానికి మంచిది. కరిగే పీచుపదార్థాలు తినటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.

పీచు పదార్ధాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలా మంచిది

సహజంగా ప్రేగులకు క్యాన్సర్ రాకుండా రక్షించబడతాం. పీచుపదార్థాలు తినకపోతే..మలబద్ధక సమస్య ఎక్కువగా వస్తుంది. అది ఎక్కువగా ఉంటే..మలం ప్రేగు క్యాన్సర్ కు దారితీస్తుంది. చిన్నప్రేగుల క్యాన్సర్ కూడా వస్తాయి. అమెరికాలాంటి దేశాల్లో క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువగా ఉంటారు. దానికి మూల కారణం..పీచుపదార్థాలను ఆహారంలో చేర్చుకోకపోవడమే. ఈ పీచుపదార్థాలు ప్రేగుల్లోకి వెళ్లి నీటిని పీల్చుకుని ఉబ్బి..ప్రేగుల్లో ఉండే ఉపయోగపడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియాకు మంచి ఆహారంగా వెళ్లి పర్మెంట్ ఐ వాటినుంచి విటిమిన్ కే తయారవడానికి బాగా సపోర్ట్ చేస్తాయి.

ప్రేగుల వాతావరణం బాగా హెల్తీగా ఉండటానికి ఇవి సహకరిస్తాయి. ఫైబర్ ఉండే ఆహారం డైలీ తింటే..సుఖవిరోచనం అవుతుంది. రక్తంలోపలికి చెక్కర పదార్థాలు స్పీడ్ గా వెళ్లకుండా ఈ ఫైబర్ మేలు చేస్తుంది. మనం తినే ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉంటే..ఆ కొవ్వు రక్తంలోకి వెళ్లకుండా..ఈ ఫైబర్ వాటిని మలం ద్వారా బయటకు పంపించేస్తాయి. చెడ్డ సూక్ష్మక్రిములను క్లీన్ చేయడానికి, టాక్సిన్ ని అంతా బయటకు పంపించడానికి, లివర్ వదిలిన కెమికల్స్ అన్నింటిని కిందకు మలం ప్రేగులోకి లాక్కురావడానికి ఫైబర్ ఉపయోగపడుతున్నాయి. ఇంకా రక్తంలో ట్రైగ్లిజరేట్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డీఎల్, వీఎల్డీఎల్ లాంటివి పెరగకుండా రక్షించడానికి కూడా పీచుపదార్థాలు ఉపయోగపడతాయి.  

శరీరంలో ఈ పనులున్నింటిని చేయడానికి ఫైబర్ ఇంత ఉపయోగపడుతుంది. మనం తినే ఆహారంలో ఎప్పుడైతే ఫైబర్ లోపిస్తుందో..ఈ పనులన్నీ జరగవు. దాని ద్వారా ఘగర, క్యాన్సర్, అధికబరువు, మలబద్ధక సమస్యలు వస్తాయి. కాబట్టి పీచుపదార్ధాలు ఎక్కువగా తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఇకనుంచి అయినా..రోజు తీనే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

-Triveni Buskarowthu

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.