గర్భిణీలకు పొట్టపై దురదగా ఉంటుందా..? ఇలా చేయండి 

ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది అనుకున్నంత చిన్న విషయం కాదు. కుటుంబంలో అందరూ ఆనందంగా ఎప్పుడెప్పుడు బేబీ వస్తుందా అని ఎదురుచూస్తారు కానీ.. ఆ పిరియడ్‌లో గర్భిణీగా ఆ స్త్రీ ఎన్నో సమస్యల

గర్భిణీలకు పొట్టపై దురదగా ఉంటుందా..? ఇలా చేయండి 


ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది అనుకున్నంత చిన్న విషయం కాదు. కుటుంబంలో అందరూ ఆనందంగా ఎప్పుడెప్పుడు బేబీ వస్తుందా అని ఎదురుచూస్తారు కానీ.. ఆ పిరియడ్‌లో గర్భిణీగా ఆ స్త్రీ ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదీ మునపటిలా ఉండదు. ఏదీ తినాలనిపించదు, కాళ్లు వాపు, వాంతులు, దురద, వికారం అబ్బో రకరకాల సమస్యలన్నీ ఆమెకే ఉంటాయి. ఇంకా బాడీలో ఏదైనా విటమిన్స్‌ లోపం ఉంటే.. వాటికి సంబంధించి టాబ్లెట్స్‌ వాడాలి. ప్రెగ్నెన్సీలో పొట్టపై దురద ఉంటుంది. ఇది సాధారణం, కానీ సమస్య మరీ ఎక్కువ కాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే..

ఐదు, ఆరో నెలల దగ్గర నుంచి గర్భం లోపల ఎదుగుతున్న బిడ్డ కోసం పొట్ట మరింతగా సాగడం మొదలవుతుంది. అప్పుడు అది పొడిబారినట్లుగా అవుతుంది. దీనికి తోడు హార్మోన్లలో మార్పులు కూడా శరీరంలో వస్తాయి. శరీరంలో అన్ని అవయవాలకు రక్త ప్రసరణ ఎక్కువగా అవుతుంది. దీంతో ఈ సమయంలో పొట్ట, పొత్తికడుపు భాగాల్లో దురద వస్తుంది.   
గర్భంపై దురదతో చాలా మంది బాగా గోకేయడం మొదలుపెడతారు. ఇలా చేయడం ఎంత మాత్రం సరికాదు. దీని వల్ల చికాకు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. చారలు, పుండ్లు వచ్చే అవకాశం ఉంది. దురద మరీ చికాకు కలిగిస్తున్నప్పుడు తడి నేప్‌కిన్‌ని లేదా ఎలాంటి రసాయనాలు లేని వెట్ టిష్యూ తీసుకుని పొట్టపై పరవండి. దానితో మెల్లగా ఆ భాగాన్ని తుడుచుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
తక్కువ రసాయనాలు గల మాయిశ్చరైజర్‌ పొట్ట మీద మెల్లగా రాసుకోండి. లేకపోతే దురద నుంచి ఉపశమనం కలిగించే కొన్ని క్రీములు మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. డాక్టర్‌ సలహాతో వాటిని దురద వస్తున్న చోట రాసుకోండి.
అలోవెరా జెల్‌లోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. చర్మం పొడిబారడం వల్ల దురద వస్తే..ఈ జెల్‌ని రాయవచ్చు. తాజాగా తీసిన కలబంద గుజ్జు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్‌‘ఈ’ నూనెతో పొట్టపై చాలా సున్నితంగా మర్దనా చేసుకోండి. దీని వల్ల దురద సమస్య నుంచి కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.
పొట్ట దగ్గర చర్మం పొడిబారిపోతున్నట్లు అనిపిస్తుంటే స్నానం చేసేప్పుడు సబ్బులు వాడకండి. బదులుగా మీగడ, సున్ని పిండితో స్నానం చేయండి. ఇది మీ చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది.
ఓట్‌ మీల్‌లో సహజంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీప్రూరిటిక్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఒక కప్పు ఓట్‌మీల్‌ వేసిన నీటితో స్నానం చేయడం, వీలైతే టబ్‌ బాత్‌ చేయడం వల్ల దురద దూరం అవుతుంది.
కొబ్బరి నూనెలో లారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌లా పనిచేస్తుంది. పొడిబారిన చర్మం, ఎగ్జిమాలాంటి సమస్యలపై ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.