యోగా అంటే.. కేవలం పెద్దవాళ్లు, లావుగా ఉన్నవాళ్లే కాదు.. ఎవరైనా చేయొచ్చు. యోగా ఒక అలవాటుగా మారితే మీ జీవితం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది.. యోగాలో ఎన్నో ఆసనాలు.. కొన్ని రోగాలను నయం చేస్తే కొన్ని మీ అల్లరి శేష్టలను కూడా నయం చేస్తాయి.. చిన్నపిల్లలు చేయదగ్గ ఆసనాలలో ఒకటి భానామాసనం. నుదుటి మీద కనుబొమల మధ్య జ్ఞానానికి సూచిక అయిన ఆజ్ఞాచక్ర ఉంటుంది. భూనామాసనం చేస్తే ఆ చక్రం విచ్చుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వేసవిలో చిన్నారులకు ఈ ఆసనాన్ని అలవాటు చేయండి.

యోగా మ్యాట్ మీద కాళ్లు ముందుకు చాపుకొని సదుపాయంగా కూర్చోవాలి. నెమ్మది నెమ్మదిగా కుడికాలును కుడివైపునకు, ఎడమకాలును ఎడమవైపుకు జరపాలి. అలా సాధ్యమైనంతగా జరిపి, రెండు చేతులనూ నేల మీద పెట్టి మెల్లగా ముందుకు వంగాలి. మోచేతులను కింద ఆనించి ఫొటోలో చూపిన విధంగా అరచేతుల్లో చుబుకాన్ని ఉంచాలి. ఈ స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి జాగ్రత్తగా కాళ్లను యథాస్థితికి తీసుకురావాలి. ఇది పిల్లలు తేలిగ్గానే చేయగలుగుతారు. ఆసనం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మధ్యలో కొంచెం సేదతీరి మళ్లీ చేయాలి. ఒకేసారి కాళ్లను దూరం జరపకూడదు. కొన్నిరోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత రెండు కాళ్లూ సరళరేఖలా తిన్నగా తీసుకురావడం తేలికవుతుంది. ఒకేరోజు ఇది అస్సలు సాధ్యం కాదు.. తొడ కండరాలు చాలా నొప్పిగా ఉంటుంది.. రోజు కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే..ఒక నెలలలో వచ్చేస్తుంది.
భూనామాసనం ప్రయోజనాలు..
ఆజ్ఞాచక్ర తెరుచుకుంటుంది. విజ్ఞత పెరుగుతుంది.
పిల్లల్లో అల్లరి తగ్గి నిశ్శబ్దత చోటుచేసుకుంటుంది.
మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఈ ఆసనం చేయడం వల్ల కాళ్లు, నడుము వెన్నెముక, మెడ, భుజాలు బలపడతాయి.
థైరాయిడ్ గ్రంథులు క్రమబద్ధమౌతాయి.
కీళ్లకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తవు.
జీర్ణప్రక్రియ మెరుగవుతుంది.
కాలేయం పనితీరు సవ్యంగా ఉంటుంది.
కొవ్వు కరుగుతుంది.
ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
శరీరం ఉత్తేజితమౌతుంది.
ఎముకలు దృఢంగా తయారవుతాయి.
శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది.
సూచన; ఈ ఆసనం ఒకేరోజు వేయడం సాధ్యం కాదు.. నిదానంగా ఓపిగ్గా చేయాలి.. బలవంతంగా కాళ్లను జరిపితే ప్రమాదం.. చిన్న వయసు నుంచే ఈ ఆసనం వేయడం ఆలవాటు చేస్తే.. పెద్దయ్యాక చాలా తేలిగ్గా వేయగలుగుతారు.. పైగా బోలెడు ప్రయోజనాలు కూడా.. కాబట్టి మీ పిల్లలకు ఈ ఆసనం వేయడం అలవాటు చేయండి.!