పిల్లలకు ఏకాగ్రత బాగా పెరగాలంటే ఈ ఆసనాలు వేయించండి 

ఏకాగ్రత ఉంటేనే ఏ పని అయినా సులభంగా చేయగలం. ఎదిగే పిల్లలకు ఏకాగ్రత చాలా అవసరం. అప్పుడే వారు చదువుపై దృష్టిపెట్టి చక్కగా చదువుకోగలుగుతారు.

పిల్లలకు ఏకాగ్రత బాగా పెరగాలంటే ఈ ఆసనాలు వేయించండి 
yoga posses for kids


ఏకాగ్రత ఉంటేనే ఏ పని అయినా సులభంగా చేయగలం. ఎదిగే పిల్లలకు ఏకాగ్రత చాలా అవసరం. అప్పుడే వారు చదువుపై దృష్టిపెట్టి చక్కగా చదువుకోగలుగుతారు. యోగా, వ్యాయామం పిల్లలకు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అలవాటు చేయాలి. వీటిని పిల్లలకు అలవాటు చేస్తే చదువులోనే కాదూ, మానసికంగా కూడా తెలివిమంతులవుతారు. చిన్న వయసులోనే పిల్లలకు యోగా నేర్పించడం ఉత్తమం. సూర్య నమస్కారాలు, బకాసనం, బాల బకాసనం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

పిల్లలు చేయదగ్గ ఉత్తమమైన యోగాసనాలు:
 
బకాసనం:
 
ముందుకు వంగి, కాళ్ల ముందు అరచేతులు భూమి మీద సమాంతరంగా ఆనించాలి. చేతి వేళ్లన్ని ముందుకు చూపుతూ, వాటి మధ్య దూరం ఉండాలి. మీ బరువుంతా భుజాల సాయంతో అరచేతుల మీద ఉంచి మెల్లగా మీ పాదాల్ని పైకి లేపడానికి ప్రయత్నించాలి. మోచేతులు కాస్త వంచి మోకాళ్లు చంకల దగ్గర ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రెండు పాదాలను దగ్గరకు తీసుకురావాలి. మీ భుజాలు వీలైనంత సమాంతరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఒక బిందువు దగ్గర దృష్టి కేంద్రీకరించాలి.

బాల బకాసనం:

ముందుగా మీ మోచేతులు భూమికి సమాంతరంగా ఆనించాలి. చేతి వేళ్లను దూరం దూరంగా ఉంచాలి. వీటిని ఆధారంగా చేసుకుని శరీరం మొత్తాన్ని పైకి లేపడానికి ప్రయత్నించాలి. బ్యాలెన్స్ కుదిరాక, పాదాలు కూడా పైకి లేపండి. రెండు పాదాలు పక్కపక్కన ఆనించండి.

శీర్షాసనం:
మొదలు వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు అరచేతుల్ని కలిపి పట్టుకోవాలి. మోచేతులు భూమిమీద సమాంతరంగా ఉండాలి. తలను అరచేతుల మధ్యలో ఆనించాలి. అప్పుడు కాలి బొటన వేలి సాయంతో తల వైపుకు కాళ్లను వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. ఇపుడు కుడి కాలు పైకెత్తాలి. ఇపుడు శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ రెండో కాలును కూడా పెకెత్తాలి. రెండు కాళ్ల పాదాలను ఆనించాలి. మీకు సౌకర్యంగా ఉన్నంతసేపు ఈ ఆసనం వేయొచ్చు.

ఇవన్నీ చెప్పినంత సులభం కాదు. పిల్లలతో చిన్నప్పుడు నుంచే ప్రాక్టీస్‌ చేయిస్తే త్వరగా నేర్చుకోగలుగుతారు. వారిని యోగా క్లాసులకు పంపింపి నేర్పించండి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.