World Thyroid Day : సరైన సమయంలో స్పందించకపోతే థైరాయిడ్‌ ప్రాణాంతకమే..?

థైరాయిడ్‌ అనేది ఒక వయసుకో ఒక వర్గానికో పరిమితమైన వ్యాధి కాదు.. ఇది అన్ని వయసుల వారికి, అందరికీ వస్తుంది. చాలా మంది లావుగా ఉంటేనే థైరాయిడ్‌ వస్తుంది అనుకుంటారు.. అది అపోహ మాత్రమే.. థైరాయిడ్‌ సన్నగా ఉన్నవాళ్లకు కూడా వస్తుంది

World Thyroid Day : సరైన సమయంలో స్పందించకపోతే థైరాయిడ్‌ ప్రాణాంతకమే..?


థైరాయిడ్‌ అనేది ఒక వయసుకో ఒక వర్గానికో పరిమితమైన వ్యాధి కాదు.. ఇది అన్ని వయసుల వారికి, అందరికీ వస్తుంది. చాలా మంది లావుగా ఉంటేనే థైరాయిడ్‌ వస్తుంది అనుకుంటారు.. అది అపోహ మాత్రమే.. థైరాయిడ్‌ సన్నగా ఉన్నవాళ్లకు కూడా వస్తుంది. థైరాయిడ్ గ్రంథి హార్మోన్లని అతిగా విడుదల చేసినా, తక్కువ విడుదల చేసినా కూడా సమస్య. కానీ ఇవే కాదు ప్రాణాంతకమైన పరిస్థితి మరొకటి ఉంది. దీని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ధైరాయిడ్‌పై అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ థైరాయిడ్‌ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 
World Thyroid Awareness Day 2022 observed on 25th May.
శరీరం పని చేసే విధానాన్ని నియంత్రించే బాధ్యత ఎక్కువగా థైరాయిడ్ మీదే ఉంటుంది. దిగువ మెడ మధ్య భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఈ గ్రంథి ఉంటుంది. ఈ థైరాయిడ్ అసమతుల్యత ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రాణాంతకమైన ప్రమాదకర పరిస్థితి థైరాయిడ్ స్టోర్మ్. హైపర్ థైరాయిడిజం తర్వాత ఇది వస్తుంది. ఈ సమస్య వల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత అధిక స్థాయికి చేరుకుంటుంది. సరైన సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం కావచ్చు. కొన్నిసార్లు మానసిక స్థితిలో మార్పులకు కారణమవుతుంది. ఏకాగ్రత లోపించడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాదు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

థైరాయిడ్ స్టోర్మ్‌కి కారణమేంటి?

శరీరం చాలా హార్మోన్లను ఉత్పత్తి చేస్తున్నప్పుడు ట్రైఅయోడోథైరోనిన్ లేదా థైరాక్సిన్ నియంత్రణలోకి రాకపోతే అది థైరాయిడ్ స్టోర్మ్ పరిస్థితికి కారణమవుతుంది. ఇది చాలా అరుదైన పరిస్థితి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
థైరాయిడ్ సమస్యను విస్మరిస్తూ మందులు సరిగ్గా తీసుకోకపోతే ఈ పరిస్థితికి దారి తీస్తుంది.
పిల్లల్ని కనడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితమవుతుంది
ఏదైనా ప్రమాదం లేదా గొంతులో ఇన్ఫెక్షన్ వల్ల కూడా హార్మోన్ ఉత్పత్తి పెరిగిపోతుంది
గొంతులో కణితి(గాయిటర్) వల్ల శరీరానికి అవసరానికి మించి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు.
ఏదైనా ఇతర అనారోగ్యానికి శస్త్ర చికిత్స చేయించుకున్నప్పుడు హార్మోన్ ఉత్పత్తిలో పెరుగుదల కనిపిస్తుంది.
హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వ్యక్తులు అది ముదిరితే థైరాయిడ్ స్టోర్మ్‌కి అభివృద్ధి చేస్తుంది. అందుకు ప్రభావితం చేసే పరిస్థితులు ఇవే.

గాయాలు

ఏదైనా శస్త్ర చికిత్స
తీవ్రమైన మానసిక క్షోభ
స్ట్రోక్
మధుమేహం
గుండె పోటు

థైరాయిడ్ స్టోర్మ్ లక్షణాలు

 వేగవంతమైన హృదయ స్పందన రేటు
తీవ్ర జ్వరం
అధికంగా చెమటలు పట్టడం
యాంగ్జయిటీ
దీర్ఘకాలిక అతిసారం
అపస్మారక స్థితిలోకి వెళ్ళడం

చికిత్స

వైద్యుల సూచన మేరకు యాంటీ థైరాయిడ్ మందులు, పొటాషియం అయోడైడ్, బీటా బ్లాకర్స్, స్టెరాయిడ్లతో చికిత్స చేస్తారు. దీని లక్ష్యం థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి విడుదల తగ్గించడం. సరైన విధంగా చికిత్స తీసుకుంటే 1-3 రోజుల్లో పరిస్థితి మెరుగుపడుతుంది. అది తగ్గిన తర్వాత చికిత్స కొనసాగించాలా లేదా వైద్యులు నిర్ణయిస్తారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.